EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్వర్గీయ జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు

    స్వర్గీయ జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు

    పి.వి నరసింహారావు మార్గ్(నెక్లెస్ రోడ్) లో మాజీ కేంద్ర మంత్రి,ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత దివంగత జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్బంగా వారి "స్ఫూర్తి స్థల్" వద్ద ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. దివంగత జైపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పలకరించి,వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ జై పాల్ రెడ్డి సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు.

    మంత్రితో పాటు నివాళులు అర్పించిన వారిలో సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత రావు,నేతి విద్యాసాగర్ రావు,జూలకంటి రంగారెడ్డి పలువురు నాయకులు ఉన్నారు.

    జైపాల్ రెడ్డి గారి స్పూర్తి స్థల్ వద్ద సమావేశంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ...

    భారత రాజకీయాల్లో మేధస్సుకు, విలువలకు, నిబద్ధతకు ప్రతిరూపంగా నిలిచిన మహానేత సూదిని జైపాల్‌రెడ్డి గారి 7వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా ఘన నివాళులు అర్పిస్తున్నాను.

    పదవులకు విలువను తీసుకొచ్చిన నిజాయితీ గల అరుదైన ప్రజానాయకుడు జైపాల్‌రెడ్డి గారు.

    చిన్న వయసులోనే పోలియో బారిన పడినప్పటికీ అసామాన్య ఆత్మస్థైర్యం, మేధస్సు, వాక్‌చాతుర్యంతో దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

    విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఎన్నో శిఖరాలను అధిరోహించింది. మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, చేవెళ్ల నియోజకవర్గాల నుంచి లోక్‌సభకు ఎన్నికై ప్రజల గొంతుకగా నిలిచారు.

    ఇవి కూడా చదవండి

    కేంద్ర సమాచార ప్రసార, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా విశిష్ట సేవలందించారు.

    1998లో దక్షిణ భారతదేశం నుంచి తొలి అత్యుత్తమ పార్లమెంటేరియన్ పురస్కారాన్ని అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం.

    అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిష్పక్షపాత వైఖరి, విషయ పరిజ్ఞానం, విలువలతో అందరి గౌరవాన్ని సంపాదించుకున్నారు.

    రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండొచ్చు కానీ శత్రువులు ఉండకూడదని తన ఆచరణతో నిరూపించిన నాయకుడు ఆయన. అందుకే ఆయనను పలువురు "అపర చాణక్యుడు"గా అభివర్ణించారు.

    ఎమర్జెన్సీ సమయంలో సిద్ధాంతాల కోసం తన రాజకీయ భవిష్యత్తును సైతం పణంగా పెట్టిన ధైర్యవంతుడు జైపాల్‌రెడ్డి గారు. పదవుల కోసం కాదు, విలువల కోసం రాజకీయాలు చేయాలనే సందేశాన్ని తన జీవితంతో చాటిచెప్పారు.

    తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను దేశ రాజకీయాల్లో బలంగా వినిపించడంలోనూ, రాష్ట్ర సాధనకు తన అనుభవం, రాజకీయ చాతుర్యంతో సహకరించడంలోనూ ఆయన పాత్ర చిరస్మరణీయం.
    కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండగా నల్లగొండ,నిజామాబాద్,మహబూబ్ నగర్ లాంటి పట్టణాల అబివృద్దికి చేసిన కృషి,అందించిన సహకారం ఆయన దూరదృష్టికి నిదర్శనం. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే నిజమైన అభివృద్ధి అని ఆయన నమ్మారు.

    నేటి యువత జైపాల్‌రెడ్డి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అంగవైకల్యం విజయానికి అడ్డంకి కాదని, సంకల్పమే మన గమ్యాన్ని నిర్ణయిస్తుందని ఆయన జీవితం మనకు సందేశం ఇస్తోంది. ప్రజాసేవ పట్ల నిబద్ధత, ప్రజాస్వామ్య విలువల పట్ల అంకితభావం ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు.

    ఆ మహానేతకు మరోసారి నా ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నది.