EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇకపై మండల కేంద్రాల్లో 'ప్రజావాణి'.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

    Author SHANKARAVAM NEWS | 05 Aug 2026, 06:37 AM | TELANGANA
    ఇకపై మండల కేంద్రాల్లో 'ప్రజావాణి'.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

    తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు గుడ్ గవర్నెన్స్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల వద్దకే పాలన, ప్రజా ప్రభుత్వం అనే విధానాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా కీలక ముందడుగు వేసింది. ఇకపై మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి నోడల్ అధికారిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీఓ) వ్యవహరించనున్నారు.
    మండల స్థాయిలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ఆన్‌ లైన్‌ లోనూ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించేలా పోర్టల్‌ ను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలిస్తూ పౌర సంబంధాల శాఖ సమగ్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి తహసీల్దార్, ఎంపీఓ, ఎంఏఓ, ఎంఈఓ, పీహెచ్ సీ అధికారులు అలాగే సీడీపీఓ, వెల్ఫేర్ ఆఫీసర్లు, విద్యుత్, నీటి పారుదల, అటవీశాఖ, రోడ్లు- భవనాలు.. ఇతర ముఖ్య శాఖలకు సంబంధించిన దాదాపు 23 రకాల మండల స్థాయి అధికారులంతా తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది
    ఇంతకుముందు ప్రజలు తమ భూ సమస్యలు, పెన్షన్ సమస్యలు, రేషన్ కార్డు సమస్యలు, ఇతర స్థానిక మౌలిక వసతుల దరఖాస్తుల కోసం జిల్లా కలెక్టరేట్ల వరకూ వెళ్లాల్సిన అవసరం ఏర్పడేది. దాంతో ప్రజలకు రవాణా ఖర్చులు, ప్రయాణ సమయం పెరిగేది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మండల స్థాయిలోనే ప్రజా సమస్యలు పరిష్కారం కానున్నాయి. రాష్ట్రంలోని ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి ప్రజా పాలన అందించి పారదర్శకంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక ముందడుగు వేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు