🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 24 Oct, 2026 | Page: 1

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుంది – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.. అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి యోగక్షేమాలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ..

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుంది – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..
అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి యోగక్షేమాలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ..

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో శనివారం 1994 సంవత్సరంలో అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ నక్సలైట్ల దాడిలో అమరులైన ఎస్‌ఐ లక్ష్మయ్య కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకొని, వారికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రజల రక్షణ కోసం, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరులైన పోలీసు వీరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విధి నిర్వహణలో సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ 15 మంది పోలీసు సిబ్బంది అమరులయ్యారని గుర్తుచేశారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు భద్రత కల్పించగలుగుతున్నారని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులు ఏ సమస్య ఎదుర్కొన్నా పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలని, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ రమేష్,నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి,ఎస్బీ సీఐ నాగరాజు, 2 టౌన్ సీఐ ఆదిరెడ్ది,అడ్మిన్ ఆర్‌ఐ సంతోష్, 2 టౌన్ ఎస్. ఐ సైదా బాబు,అమరవీరుడు ఎస్‌ఐ లక్ష్మయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home