భూభారతి, అసైన్డ్ భూములు, ఎస్‌ఐఆర్, రీ-సర్వే పనులపై అధికారులు ప్రతిరోజూ ప్రత్యేక దృష్టి సారించి జాగ్రత్తగా పని చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
భూభారతి, అసైన్డ్ భూములు, ఎస్‌ఐఆర్, రీ-సర్వే పనులపై అధికారులు ప్రతిరోజూ ప్రత్యేక దృష్టి సారించి జాగ్రత్తగా పని చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో 22ఏకు సంబంధించిన నిబంధనలను జాగ్రత్తగా అమలు చేయాలని కలెక్టర్ చెప్పారు.
అసైన్డ్ భూములు, సీలింగ్ భూములు, అటవీ భూములు, ప్రభుత్వ భూములు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి వివరాలను నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మండలాల వారీగా, గ్రామాల వారీగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, గ్రామకంఠం భూములు, ఇనాం భూములు తదితర భూములను సర్వే చేసి పూర్తి సమాచారం సేకరించాలని తెలిపారు.భూములకు సంబంధించిన రికార్డులను అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ముఖ్యంగా రీ-సర్వే పనులు అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని, భూముల వివరాల నమోదు, సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ స్థాయిలో నోటీసులు జారీ చేయాలని తెలిపారు. ఓటరు జాబితాలను గ్రామస్థాయిలో చదివి వినిపించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా రెవిన్యూ అధికారి దశరథ, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.