🏠 neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
neelagirishankaravamu.in | Date: 27 Jul, 2026 | Page: 1

ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సత్వరమే పరిష్కరించడo ప్రతి శాఖాధికారి బాధ్యత -రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్

ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సత్వరమే పరిష్కరించడo
ప్రతి శాఖాధికారి బాధ్యత అని రెవెన్యూ అదనపు కలెక్టర్
జె. శ్రీనివాస్ అన్నారు.

ప్రజావాణి లో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు.
అనంతరం జిల్లా అధికారులతో సమీక్షిస్తూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలని అన్నారు.ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.
అధికారులందరూ సమయపాలన పాటిస్తూ విధులను నిర్వహించాలని అన్నారు.అన్ని శాఖల అధికారులు తమ శాఖల నెలవారీ ప్రగతి నివేదికలను (మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్) ఆగస్టు 3లోగా జిల్లా ప్రణాళిక అధికారి (సీపీఓ)కి సమర్పించాలని ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన మహాలక్ష్మి, చేయూత, ఆరోగ్యశ్రీ, ఇందిరా మహిళా శక్తి, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి తదితర పథకాల అమలు పురోగతిపై నివేదికలను ఆగస్టు 3లోపు అందజేయాలని చెప్పారు.జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, భూ- భారతి చట్టం నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ భూములను గుర్తించి పరిరక్షించే చర్యలు చేపట్టాలని తహశీల్దార్లను ఆదేశించారు. గ్రామపంచాయతీలు, కమ్యూనిటీ హాళ్లు, జాతీయ రహదారులు, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన భూముల వివరాలను పరిశీలించి, సంబంధిత చట్టంలోని సెక్షన్ల ప్రకారం అవసరమైన గెజిట్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సోమవారం నాటి ప్రజావాణిలో 119 దరఖాస్తులు రాగా, రెవిన్యూ డిపార్ట్మెంట్ కు77, ఇతర శాఖలకు 42 వచ్చాయి.

జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి ,ట్రైనీ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ,జిల్లా అధికారులు ప్రజాలవద్దనుండి విజ్ఞాపణలు స్వీకరించారు.
🏠 Home